సేవలకు సెలవు

0
2


సేవలకు సెలవు

జిల్లా ఆసుపత్రిలో ప్రశ్నార్థకంగా మారిన వైద్యం

ఉన్నపలంగా 26 మంది ఎస్సార్ల తొలగింపు

పనిచేసేందుకు ఆసక్తి చూపని కొత్తవారు

డీఎంఈ ఆదేశాలతో గందరగోళం

డీఎంఈ స్థాయి ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాలు రోగుల పాలిట శాపంగా మారాయి. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అరకొరగా ఉన్న వైద్యులతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయని రోగులు బాధపడుతుంటే.. ఇక్కడ పనిచేస్తున్న ఒప్పంద ఎస్సార్లను(సీనియర్‌ రెసిడెన్స్‌) ఉన్నపలంగా తొలగించారు. కొత్తవారి కోసం ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తే ఎవరూ ముందుకు రావడం లేదు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద పద్ధతిలో ఎస్సార్లుగా ఏడాది పాటు పనిచేస్తే వీరిని సహాయ ఆచార్యులుగా నియమించుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌, గాంధీ ఆసుపత్రుల్లో ఇలా ఒక్కసారి చేరిన వారు మూడు, నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. కొత్తవారికి అవకాశం దొరకడం లేదు. ఆయా చోట్ల ఈ పరిస్థితి గమనించిన డీఎంఈ రమేష్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న ఎస్సార్లను ఒక సంవత్సరం పాటు ఒప్పంద పద్ధతిలో ఉంచి.. గడువు ముగియగానే తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నెల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో వారం క్రితం గడువు ముగిసిన 26 మందిని తొలగించారు.

హైదరాబాద్‌కు..నిజామాబాద్‌కు తేడా..

హైదరాబాద్‌లో ఎస్సార్లుగా పనిచేసేందుకు పోటీ పడుతుంటారు. మన జిల్లా విషయానికి వస్తే దరఖాస్తులు ఆహ్వానించినా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. డీఎంఈ స్థాయి ఉన్నతాధికారులు కేవలం హైదరాబాద్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అదే పద్ధతి ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఆసుపత్రి పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక్కడ అసిస్టెంటు, అసోసియేటు, ఆచార్యులు మొక్కుబడిగా వచ్చి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎస్సార్లే భారం మోయాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లా ఆసుపత్రిలో రెగ్యులర్‌ వైద్యుల పోస్టులు 220 మంజూరు కాగా.. ప్రస్తుతం 90 మంది పనిచేస్తున్నారు. ఒప్పంద ఎస్సార్ల విషయానికి వస్తే మొత్తం 68 పోస్టులు ఉండగా.. సంవత్సరం ఒప్పంద గడువు ముగియనివారు ప్రస్తుతం 15 మంది పనిచేస్తున్నారు. గడువు ముగిసిన 26 మందిని ఇటీవల తొలగించారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. కేవలం 15 మంది మాత్రమే పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇంకా 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతకు ముందు పనిచేసిన వారిని తీసుకోవద్దని నిబంధన ఉండటంతో పాత వారిని నియమించలేని పరిస్థితి ఉంది. మరో విషయం ఏమిటంటే పాత వారికి నాలుగు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉందని తెలిసింది.

పాతవారిని తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి

– ఇందిరా, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌

కొత్త ఎస్సార్లకు అవకాశం ఇచ్చేందుకు పాతవారిని తీసుకోవద్దని డీఎంఈ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ కొత్తవారు పనిచేయడానికి ఆసక్తి చూడపం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి ఇంటర్వూలు నిర్వహిస్తాం. అప్పటికీ ఎవరూ రాకుంటే డీఎంఈ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. నిధుల కొరత వల్ల పాతవారిలో కొందరికి వేతనాలు ఇవ్వలేకపోయాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here