సేవల్లో సమూల మార్పులు

0
3


సేవల్లో సమూల మార్పులు

పోలీసులపై ప్రజల్లో పెరిగిన విశ్వసనీయత

‘ఈనాడు’తో జిల్లా ఎస్పీ శ్వేత

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పరుగులు పెడుతోంది. శాంతి భద్రతల పరి రక్షణలో పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలందేలా ముందుకెళ్తున్నామని ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి.. పోలీసుల పనితీరు.. ప్రజలకు అందిస్తున్న సేవల తీరును ఆమె ‘ఈనాడు’కు వివరించారు. పోలీసులకు పనిభారం తగ్గించాలని జిల్లాలోని అన్ని ఠాణాల్లో ఈ- కార్యాలయం విధానాన్ని ప్రారంభించాం. ఇది సత్ఫలితాన్ని ఇస్తోంది. దీని వల్ల పనిభారం కొంత మేర తగ్గింది. అది ఎలాగంటే ఉదాహరణకు గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగానే ఆ వివరాలు సర్కిల్‌, డివిజన్‌, జిల్లా పోలీసు కార్యాలయాలకు తీసుకెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు

నేరాలు, దొంగతనాల నియంత్రణకు పట్టణాలు, పల్లెల్లో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1762 సీసీ కెమెరాలు బిగించాం.

క్రైమ్‌ కంట్రోల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ విధానం

నేరాల నియంత్రణకు సీసీటీఎన్‌ఎస్‌( క్రైమ్‌ కంట్రోల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం)ను అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. నేరస్తుల వివరాలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.

5-ఎస్‌ విధానం అమలు

ఠాణాల్లో ప్రయోగాత్మకంగా 5-ఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఠాణాల్లో దస్త్రాలు నిర్ణీత ప్రదేశంలో ఉండేలా ఏర్పాటు చేశాం. దీని వల్ల ఠాణాలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి దస్త్రాలన్నీ అందుబాటులో ఉంటాయి. సిబ్బంది ఎవరైనా సెలవులో ఉన్నా ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తున్నాం.

ఠాణాల్లో మౌలిక వసతుల కల్పన

ప్రతి స్టేషన్‌లో మౌలిక వసతులు కల్పించాం. వాహనాలు సమకూర్చడంతో పాటు రిసెప్షన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశాం. ఠాణాల్లో ప్రజలకు అందించే సేవలను 14 రకాలుగా విభజించి ప్రత్యేకంగా బాధ్యులను నియమించాం. మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ముగ్గురు మహిళా హోంగార్డులకు శిక్షణిచ్చి వారే స్వయంగా వాహనాలు నడిపించేలా చేశాం.

కేసుల ఛేదనలో ముందంజ

సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 90 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతకు ముందే నమోదైన కేసుల పూర్వ పరాలు తెలుసుకొని ఛార్జిషీటు దాఖలు చేసేలా ఏర్పాటు చేశాం. పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం సఫలమైంది. పోలీసులు సమష్టిగా పనిచేసి పలు కేసులను ఛేదించారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని పీడీ యాక్టు అమలు చేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 17 మంది నేరగాళ్లపై పీడీ యాక్టును నమోదు చేశాం.

‘‘షీ’’ బృందాలతో రక్షణ

జిల్లాలో మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం ‘షీ’బృందాలు నియమించాం. ఈవ్‌టీజింగ్‌, మహిళలపై జరుగుతున్న నేరాలు అరికట్టాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1600 మందికి కౌన్సెలింగ్‌ చేశాం. కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీసుల కళాబృందంతో అవగాహన కల్పిస్తున్నాం.

కుటుంబ స్నేహిత

జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో పాలనాధికారి సహకారంతో కుటుంబ స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

కామారెడ్డి పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, సీనియర్‌ సిటిజన్లతో కలిసి స్వశక్తి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.

కుటుంబ సమస్యలు మహిళా సంఘాల సమక్షంలోనే పరిష్కరించుకొనేలా వారికి అవగాహన కల్పిస్తున్నాం.

నిరుద్యోగులకు ‘యువనేస్తం’

కానిస్టేబుల్‌గా ‘కొలువు’దీరేందుకు నిరుద్యోగులకు ‘యువ నేస్తం’ పేరుతో 400 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. 42 మంది ఎంపికయ్యారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here