సేవాతత్పరులు

0
1


సేవాతత్పరులు

కష్టాల్లో ఉన్న వారికి చేయూత

ఊరి కోసం కదిలొచ్చిన యువత

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టు ఉదారత

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి

పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి సాయం చేస్తున్న సభ్యులు

ఊరి కోసం ఏదైనా చేయాలనే సంకల్పం వారిని బృందంగా ఏర్పరిచింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. ముందుకెళ్తున్నారు డిచ్‌పల్లి మండలం యానంపల్లికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టు సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులతో పాటు, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు.

విద్యా వాలంటీర్‌గా పనిచేస్తూ ఉపాధ్యాయ కొలువు సాధించిన టి.మోహన్‌ ఊరి కోసం ఏదైనా మంచి చేయాలని తపించేవారు. తన ఆలోచనని ఇతరులతో పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు, స్నేహితులు 15 మంది సభ్యులుగా 2017లో ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టు’ ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు మరికొంత మంది ఆకర్షితులవడంతో సభ్యుల సంఖ్య 45కు చేరుకొంది.

చెక్కు రూపంలో..

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టు పేరున బ్యాంకు ఖాతా తెరిచారు. గ్రామంతో పాటు, విదేశాల్లో ఉన్న సభ్యులు వారి శక్తి మేరకు డబ్బులను విరాళంగా ఇస్తారు. ఇలా జమైన నగదును సేవా కార్యక్రమాలకు చెక్కు రూపంలో ఇస్తుంటారు. ప్రభుత్వ బడిలో విద్యనభ్యసించిన విద్యార్థులు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఉన్నత చదువుకు సాయం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక పరిస్థితి బాగాలేని వారి ఖర్చులు భరించడంతో పాటు నిరుపేద ఆడ పిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

చేపట్టిన సేవా కార్యక్రమాలు

* మానసిక ఆరోగ్యం సరిగా లేక గల్ఫ్‌ నుంచి వచ్చిన కుమ్మరి సాయికుమార్‌ చికిత్సకు రూ.10 వేలు

* దాసరి మౌనిక వైద్య ఖర్చులకు రూ.15 వేలు

* పసుక కావ్య వివాహానికి వంట సామగ్రి కొనుగోలు

* నిరుపేద విద్యార్థిని మేదరి మౌనిక ఉన్నత చదువులకు రూ.10 వేలు 

* గ్రామంలోని అనాథాశ్రమంలో ఉన్న వారికి దసరా పండగ సందర్భంగా నూతన వస్త్రాల కోసం రూ.10 వేలు

* డిచ్‌పల్లిలో ‘సమాజ సేవా’ కార్యక్రమాలకు రూ.10 వేలు

* తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆదిలాబాద్‌ బాలికకు రూ.10 వేలు

* కేరళ వరద బాధితుల కోసం రూ.30 వేలు విరాళం అందించారు.

* ట్రస్టు ద్వారా ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

సమష్టి కృషి: మోహన్‌, ట్రస్టు అధ్యక్షుడు

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టులో సభ్యులుగా ఉన్న విద్యార్థులు, తోటి స్నేహితుల విరాళాలతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఊరి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో దీన్ని మొదలుపెట్టాం. సభ్యుల సమష్టి కృషితో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here