‘సైరా’ ట్విట్టర్ రివ్యూ: మెగా అభిమానులు రొమ్ము విరిచి చెప్పే సినిమా

0
4


మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మొదలైపోయింది. అన్నయ్య సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆత్రుతగా వారంతా ఎదురుచూశారు. ఈరోజు తెల్లవారుజామున ఏపీలో చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటల వరకు మెగా అభిమానులు ఆగాల్సిందే.

మరోవైపు, యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజాము నుంచే అక్కడ షోలు ప్రదర్శితమవుతున్నాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలాగే, బాలీవుడ్‌లో మంగళవారం రాత్రే జర్నలిస్టులకు స్పెషల్ షో వేశారు. అక్కడ సినిమా చూసిన జర్నలిస్టులు సైతం ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ‘సైరా’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ట్విట్టర్‌లో వస్తోన్న టాక్‌ను బట్టి చూస్తే బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్. చిరంజీవి పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. అద్భుతమైన తారాగణం, రోమాలు నిక్కబొడిచే డైలాగులు, మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్లే బ్యాక్ ‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు ఇలా సినిమాలో అన్నీ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి నటన అద్భుతమట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన జీవించేశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నా సైతం సినిమాకు ప్లస్ అయ్యారట. మెగా అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. మెగా అభిమానిని అయినందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఒక రేంజ్‌లో ఉంటే.. సెకండాఫ్ అంతకు మించి ఉందట. దేశభక్తిని ఇనుమడించే సినిమానే అయినా దర్శకుడు సురేందర్‌రెడ్డి కమర్షియల్ అంశాలను బాగా జోడించి ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా సినిమా తెరకెక్కించారని కొనియాడుతున్నారు. రామ్ చరణ్ తన తండ్రికి ఈ సినిమాతో జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. యూఎస్‌లో సైతం ప్రీమియర్ షోలకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రీమియర్లతో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్ రావడం ఖాయం అంటున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here