హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

0
3


ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు వేణుమాధవ్ మృతిచెందినట్టు ఆయన సోదరుడు గోపాలకృష్ణ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఉన్న ఇంటికి వేణుమాధవ్ మృతదేహాన్ని తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.

కాగా, వేణుమాధవ్‌కు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యపేట జిల్లా కోదాడ. 1968 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగారు.

గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వేణుమాధవ్ రాజకీయాల్లోనూ కాలుమోపారు. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనప్పటికీ నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించడంతో కుదరలేదు. అప్పటికి వేణుమాధవ్ ఆరోగ్యంగానే ఉన్నారు.

అయితే, గతకొద్ది నెలలుగా వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈనెల 6న కుటుంబసభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పటిల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఆయనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు. అయితే, మంగళవారం వేణుమాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ని ఐసీయూలోకి మార్చారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన్ని డాక్టర్లు కాపాడలేకపోయారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here