హృదయ విలాపం

0
3


హృదయ విలాపం

ఉభయ జిల్లాల్లో పెరుగుతున్న బాధితులు

29న ప్రపంచ హృదయ దినోత్సవం

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

ఒక క్షణం ఆగండి.. దీర్ఘ శ్వాస పీల్చుకొని నిశ్శబ్దంగా వినండి. లబ్‌డబ్‌మంటూ వినిపించేది మీ హృదయ స్పందనే. అవయవాలన్నీ సవ్యంగా పనిచేయడానికి ఇంధనాన్ని అందించే యంత్రం. విలువైన దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి.. ప్రాణాధారమైన గుండెకు ముప్పు నుంచి రక్షణ కల్పిద్దాం. జీవన శైలిలో మార్ఫు. ప్రకృతిని ప్రేమించడం.. మేలైన ఆహారం తీసుకొని, కాసింత వ్యాయామం.. నవ్వుతూ.. మెట్లెక్కడం.. నడుస్తూ హాయిగా సాగిపోదాం.. అలా మన గుండెను కాపాడుకొందాం.. ఎదుటివారినీ ఇలాగే ప్రోత్సహిస్తామని వాగ్దానం చేద్దాం…

…అంటూ వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌(డబ్ల్యూ.హెచ్‌.ఎఫ్‌) పిలుపునిస్తోంది. సమాఖ్య ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రతిసారి ఓ కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. ఈసారి హార్ట్‌ హీరోలుగా ఉందామంటూనే ఎదుటి వారినీ హీరోలుగా మార్చడానికి కంకణ బద్దులమవుదామని పిలుపునిస్తోంది. గుండె ఆరోగ్యం అందరికీ సమాన హక్కు అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని సంస్థలను.. భాగస్వాములవ్వాలని ప్రజలను కోరుతోంది.

ఉభయ జిల్లాల్లో ప్రాంతం.. వయసు.. తేడా లేకుండా అందరినీ గుండె జబ్బులు వేధిస్తున్నాయి. జీవనశైలి విధానాలే ఇందుకు కారణం. 2017-18లో గుండె సంబంధ వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం సుమారు రూ.21.69 కోట్లు వ్యయం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు ఈ పథకం పరిధిలోకి రానివారి ఖర్చు అదనం. హృద్రోగ మరణాలపై గణాంకాలు లేకపోయినా జాతీయ సగటుతో సమానంగా ఉంటున్నాయని అంచనా.

ఆరోగ్యశ్రీ నివేదిక ఆధారంగా గుండె వ్యాధి చికిత్సలగణాంకాలు

చికిత్స పొందిన వారు 5,380

ప్రభుత్వ ఖర్చు 21.69 రూ.కోట్లు

చేయాల్సింది ఇదీ..

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా పిడికెడు గుండెను కాపాడుకోవడానికి మనతోపాటు ఎదుటివారిలోనూ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.

● వైద్య నిపుణులు, స్వచ్ఛంద, ఆరోగ్య సేవా సంస్థలు సమన్వయంతో హృదయ సంరక్షణ క్లబ్బులు ఏర్పాటు చేయాలి. ● గుండెకు మేలు చేసే నడక, వ్యాయామం, మంచి అలవాట్లపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమూహాల ఏర్పాటుపై దృష్టి సారించాలి.

దృఢ భారత్‌ కోసం ఫిట్‌ ఇండియా

జన్యుపరంగా వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేయడం తప్పితే రాకుండా నియంత్రించలేం. రక్తపోటు, మధుమేహంతో వచ్చే హృద్రోగాలను నియంత్రించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఫిట్‌ ఇండియా పేరిట కేంద్రం కొత్త నినాదాన్ని తీసుకొచ్చింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. రోజూ నడక, వ్యాయామం వంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నది కార్యక్రమం ఉద్దేశం.

పసి గుండె బలహీనం

పోషకాహారలేమి, జన్యుపరమైన కారణాలతో పిల్లల్లో గుండె సంబంధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానమూ పసి హృదయాల పనితీరును దెబ్బ తీస్తోంది. ఎక్కువ సేపు కూర్చోబెట్టి చదివించడం, ఆటలకు దూరం, ఒత్తిడి చదువులు వెరసి చిన్న వయసులోనే గుండె పోటు రావడానికి కారణమవుతున్నాయనే వాదన ఉంది. ఇప్పటికే ఆర్బీఎస్కేలో వివిధ కారణాలతో గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించారు.

ఓపెన్‌ జిమ్‌లు….

పట్టణ, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం. నడకకు స్థలం, సమయం ఉండదు. కనీసం వ్యాయామశాలకు వెళదామన్నా ప్రైవేటులో రుసుముల భారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేసింది. రూ.12 లక్షల విలువ చేసే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉభయ జిల్లాల్లోని పాత మున్సిపాలిటీల్లో ఆరు జిమ్‌లు ఏర్పాటయ్యాయి.

నిజామాబాద్‌లో ఈ ఏడాది ఆగస్టు వరకు 55 మందికి చికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం రూ.11 లక్షలు ఖర్చు చేసింది.

నియంత్రణకు ప్రభుత్వ చర్యలు

నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజ్‌(ఎన్సీడీ)… అసాంక్రమిక వ్యాధులుగా పరిగణించే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి వాటిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగమే ఎన్సీడీ సర్వే. దీని ఆధారంగా ప్రాథమిక లక్షణాలున్న వారికి సకాలంలో వైద్యం అందించనున్నారు. ఇందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చి పీహెచ్‌సీ స్థాయి సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు ఉభయ జిల్లాల్లో 25 ఉప కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతోపాటు ఎంపిక చేసిన పీహెచ్‌సీల ఆవరణలో యోగా, ధ్యానం, చికిత్స అందించే ఆయుష్‌ కేంద్రాల స్థాపనకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఎన్సీడీ సర్వే ఆలస్యంగా మొదలైనందున గణాంకాలు ఇంకా తేలలేదు. గతంలో నిర్వహించిన ప్రయోగ ప్రాజెక్టులో మాత్రం 1,848 మంది గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు 40,810 మందికి, మధుమేహం 23,946 మందికి ఉందని గుర్తించారు.

కామారెడ్డిలో ఎన్సీడీ సర్వేలో రక్తపోటు 25,256, మధుమేహం 18,351 మందికి ఉన్నట్లు గుర్తించారు.

యోగాసనాలేద్దాం

గుండె కోసం యోగా.. ఇది 2019 యోగా దినోత్సవానికి నిర్దేశించిన అంశం. ప్రపంచ దేశాలతోపాటు భారత ప్రభుత్వాన్ని గుండె సంబంధ వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ఉన్న మార్గాలన్నింటినీ తెర మీదకు తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా ఈసారి గుండె కోసం యోగా అన్న నినాదంతో ముందుకొచ్చింది. యోగాలో శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి అన్ని ఆసనాలు గుండె పనితీరును మెరుగుపరిచేవే అని నిరూపితమైనట్లు నిపుణులు చెబుతారు.

భరోసా కల్పించేవి

ఆధునిక జీవన సమస్యల్లో కొన్నింటిని దూరం చేసుకొంటే గుండెకు భరోసా లభిస్తుందని నిపుణులు చెబుతున్నరు..

కంటి నిండా, ఏడున్నర గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.

అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం నిర్ణీత వేళల్లో చేయాలి.

పీచు పదార్థాలుండే తాజా కూరగాయలు, ఆహారం, పండ్లు తీసుకోవాలి.

రాత్రివేళల్లో మొబైల్‌, ల్యాప్‌టాప్‌ తెరలను వీక్షించడం తగ్గించాలి

రోజూ కనీసం 10-30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ఒత్తిడి దూరం చేసే యోగా, సంగీతం వినడం వంటి అంశాలపై దృష్టి సారించాలిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here