100 కొత్త విమానాలు కొననున్న స్పైస్ జెట్, డీల్ విలువ రూ.91,000 కోట్లు

0
2


100 కొత్త విమానాలు కొననున్న స్పైస్ జెట్, డీల్ విలువ రూ.91,000 కోట్లు

చవక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ భారీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలోని మరిన్ని రూట్ల లో సర్వీస్ లు నడపడంతో పాటు, విదేశి మార్గాల్లో విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో స్పైస్ జెట్ ఏకంగా 100 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఎయిర్ బస్ అనే ప్రముఖ విమానాల తయారీ కంపెనీకి ఈ ఆర్డర్ ఇవ్వబోతోంది. దీని విలువ $13 బిలియన్ డాలర్లు (సుమారు రూ 91,000 కోట్లు) మేరకు ఉంటుందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఒక కథనంలో వెల్లడించింది. ఎయిర్ బస్ ఎస్ఈ రకం విమానాలను కొనుగోలు చేయబోతోంది.

గతంలో ఈ కాంట్రాక్టు మరో ప్రముఖ విమాన తయారీ కంపెనీ ఐన బోయింగ్ కు వెళుతుందని భావించారు. అయితే, ఈ కంపెనీకి చెందిన 737 మాక్స్ అనే విమానాల్లో సాంకేతిక లోపంతో చాలా ఆర్డర్లు రద్దు కావడంతో ప్రస్తుతం బోయింగ్ ఇబ్బందుల్లో ఉంది. దీంతో ఈ బంపర్ ఆఫర్ ఎయిర్ బస్ సొంతం కానుంది. ప్రణాళిక బద్ధమైన తమ విస్తరణలో భాగంగా ఎయిర్‌బస్ ఏ321ఎల్ ఆర్, ఎక్స్ ఎల్ ఆర్ మోడల్ విమానాలు అధికంగా కొనే అవకాశం ఉన్నట్లు స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు.

‘బోయింగ్ విమానాలు వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఎయిర్ బస్ మమ్మల్ని తమ విమానాలు కొనేలా ప్రోత్సహాహిస్తోంది. బోయింగ్ సమస్యలు అధికమైన తర్వాత అది మరింత అధికం ఐంది. వాళ్ళు మాకు ఒక వాణిజ్యపరమైన ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం మేము దానిని పరిశీలిస్తున్నాం’ అని న్యూ యార్క్ లోని బ్లూమ్‌బెర్గ్ ప్రధాన కార్యాలయం లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో అజయ్ సింగ్ పేర్కొన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే, ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్లు సమాచారం.

కొత్తగా 205 విమానాలు…

దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీ ఐన స్పైస్ జెట్… వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగంలో మరింతగా ఎదిగేందుకు కొత్తగా 205 విమానాలను కొనుగోలు చేయాలనీ భావిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన 13 మాక్స్ జెట్లను వినియోగిస్తోంది. కాగా… ప్రస్తుతం ఎయిర్ బస్ తో స్పైస్ జెట్ చర్చలు జరుపుతుండటం తో బోయింగ్ ఆందోళన చెందుతోంది. 103 ఏళ్ళ చరిత్ర లో బోయింగ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే సమయం లో యూరోప్ లోని నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసే ఎయిర్ బస్ ఈ రంగంలో బోయింగ్ కు గట్టి పోటీ ని ఇస్తోంది.

రూ 91,000 కోట్లు …

స్పైస్ జెట్ ప్రధానంగా ఏ కంపెనీకి ఆర్డర్ ఇచ్చినా అది కచ్చితంగా 100 విమానాలకు తక్కువ ఉండదు. అందుకే ప్రస్తుతం ఎయిర్‌బస్ కు ఇచ్చే ఆర్డర్ కూడా 100 విమానాలు ఐ ఉంటాయని భావిస్తున్నారు. 2018 లోని ధరల ప్రకారం ఎయిర్‌బస్ ఏ321నియో విమానాల ఆర్డర్ ధర 100 విమానాలకు $13 బిలియన్ డాలర్లు (రూ 91,000 కోట్లు ) కు పైగానే ఉంటుందని లెక్కలేస్తున్నారు. ఈ నిధులను ఎయిర్‌బస్ ఒక వాణిజ్యపరమైన ఒప్పందం ద్వారా స్పైస్ జెట్ కు అందించే అవకాశం ఉంది. బంబార్డియర్ అనే మరో కంపెనీ విమానాలు సైతం స్పైస్ జెట్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

నేలపైనే బోయింగ్ 737 విమానాలు…

అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన బోయింగ్ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా బాగా అమ్ముడయ్యాయి. కానీ మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే రెండు మాక్స్ విమానాలు ఢీకొని 346 మంది ప్రయాణికులు మరణించారు. దీంతో అమెరికా విమానయాన సంస్థ 737 మాక్స్ విమానాల తయారీ లో లోపాలపై దర్యాప్తు జరుపుతోంది. మన దేశంలోనూ ఈ విమానాల వాడకాన్ని నిషేదించారు. దీంతో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాలు నేలపైనే ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసిన స్పైస్ జెట్ వంటి కంపెనీలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే, స్పైస్ జెట్ దృష్టి ఇప్పుడు ఎయిర్‌బస్ వైపు మళ్లినట్లు సమాచారం.

అపార అవకాశం…

భారత్ లో దశాబ్ద కాలంగా విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చవక ధరల విమానయాన కంపెనీల రాక ఈ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. మధ్య తరగతి ప్రజలు కూడా విమానయానని అలవాటు పడుతున్నారు. అయితే, 130 కోట్లకు పైగా ఉన్న భారత్ జనాభా లో ఇప్పటికీ విమానం ఎక్కని వారు 100 కోట్లకు పైగానే ఉంటారు. అందుకే, మన దేశంలో వచ్చే 10-20 ఏళ్లలో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. 2018-19 లో భారత్ విమానయాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 17% పెరిగి సుమారు 31 కోట్లకు చేరింది. భవిష్యత్ లో ఇది 100 కోట్లు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here