370 అధికరణ రద్దుపై తప్పుడు ప్రచారం

0
2


370 అధికరణ రద్దుపై తప్పుడు ప్రచారం

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు


మురళీధర్‌రావును గజమాలతో సత్కరిస్తున్న స్థానిక నాయకులు

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: అధికరణ – 370 రద్దుపై కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో బుధవారం నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలస్థాయి కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 370 అధికరణ రద్దుకు కశ్మీర్‌ విలీనానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 550 సంస్థానాలతో పాటు కశ్మీర్‌ విలీనమైందని, ఆ తర్వాతే 370 అధికరణ వచ్చిందని పేర్కొన్నారు. అధికారణ రద్దుతో కశ్మీరీల సంస్కృతికి ఎలాంటి నష్టం రాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారని వివరించారు. అక్కడ 70 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లేవని, మహిళలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లిచేసుకుంటే ఆస్తిహక్కు కోల్పోవాల్సి వచ్చేదని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు అధికరణను తొలగించే ధైర్యం చేయలేకపోయిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక పాకిస్థాన్‌కు మద్దతిచ్చేలా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. ముస్లిం దేశాలు సైతం ఆ దేశానికి మద్దతివ్వలేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట స్థానం సంపాదించిన 3 వేల మంది ప్రముఖులను కలిసి 370 అధికరణ రద్దు నిర్ణయానికి గల కారణాలు వివరించి, అందుకు సంబంధించిన పుస్తకాలను అందజేయాలని, 370 బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర నాయకులు ఇందులో పాల్గొంటున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందుకోసం రాష్ట్రంలో అయిదుగురితో కమిటీ వేశామని తెలిపారు. ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జగదీశ్వర్‌రెడ్డి, శివరాజ్‌, న్యాయవాది శ్రీధర్‌, అంకాపూర్‌ రైతు భాజన్నలను కలిసి 370 అధికరణ రద్దుకు గల కారణాలను వివరించి, సంబంధించిన పుస్తకాలను అందజేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు లోక భూపతిరెడ్డి, పి.వినయ్‌రెడ్డి, పి.శివరాజ్‌కుమార్‌, బద్దం లింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here