4 వారాల నష్టాలకు బ్రేక్ ! రెండో రోజూ భారీ లాభాల్లోనే ముగింపు

0
1


4 వారాల నష్టాలకు బ్రేక్ ! రెండో రోజూ భారీ లాభాల్లోనే ముగింపు

స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ భారీలాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో మరింత నూతనోత్తేజాన్ని నింపింది. అల్ట్రారిచ్‌పై ట్యాక్స్ తగ్గిస్తారనే అంచనాలు, ఎల్టీసీజీపై పునఃసమీక్ష ఉంటుందనే అత్యాశతో మార్కెట్లు పైపైకి దూకాయి. ముఖ్యంగా కుప్పకూలిన ఆటో రంగ షేర్లలో ఉత్సాహం రెట్టింపైంది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ కోలుకున్నాయి. ఆటో ఇండెక్స్ రెండు శాతం వరకూ పెరిగింది.

ఉదయం 11087 పాయింట్ల దగ్గర స్వల్ప లాభాలతో మొదలైన నిఫ్టీ ఇంట్రాడేలో 11181 పాయింట్ల వరకూ పెరిగింది. అయితే ఆఖరి అరగంటలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో 70 పాయింట్ల వరకూ దిగొచ్చింది. దీంతో నిఫ్టీ చివరకు 77 పాయింట్ల లాభంతో 11,109 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 37581 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్లు పెరిగి 28431 దగ్గర స్థిరపడింది.

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ ఒక్క శాతం వరకూ పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, రియాల్టీ ప్యాక్‌లో కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా నమోదైంది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, టైటన్, మారుతి, బజాజ్ ఫైనాన్షియర్ సర్వీసెస్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, సిప్లా, టెక్ మహీంద్రా, హిందాల్కో, కోల్ ఇండియా స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మళ్లీ యెస్ బ్యాంక్‌లో టెన్షన్

యెస్ బ్యాంక్ స్టాక్‌ 9 శాతం నష్టపోయింది. తక్షణ క్యాపిటల్ అవసరాల కోసం బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్మెంట్‌కు వస్తోందనే వార్తలొచ్చాయి. ఇది ఎమర్జెన్సీ ఫండింగ్ లాంటి పరిస్థితి. దీంతో స్టాక్‌లో సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. మార్కెట్లు లాభాల్లో ఉన్న స్టాక్‌ మాత్రం నెగిటివ్ ట్రేడ్‌లోనే ఉంది. ఈ రోజు 8 శాతం నష్టంతో చివరకు రూ.82.10 దగ్గర క్లోజైంది.

MRF రిజల్ట్స్

తాజా త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 15.1 శాతం, నికర లాభం 2.1 శాతం వృద్ధిని నమోదు చేసింది ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్. దీంతో స్టాక్ ఈ రోజు ఏకంగా 4 శాతానికి పైగా పెరిగింది. మిగిలిన ఆటో కంపెనీల స్టాక్స్‌ కూడా పెరగడంతో ఇది కూడా ర్యాలీలో పాల్గొంది. చివరకు 4 శాతం లాభాలతో రూ.56954 దగ్గర క్లోజైంది.

జెట్ పతనం స్పైస్‌జెట్‌కు కలిసొచ్చింది

గతంలో ఎప్పుడూ లేనంతగా స్పైస్ జెట్ ఆదాయం 35 శాతం, నికర లాభం 700 శాతానికి పైగా పెరిగింది. నెట్ ప్రాఫిట్ రూ.262 కోట్లకు చేరింది. నిరుడు ఇదే సమయానికి రూ.38 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ ఇప్పుడు భారీ లాభాల్లోకి వచ్చింది. దీంతో ఈ స్టాక్ 5 శాతం లాభాలతో రూ.138 దగ్గర క్లోజైంది.

ఇండియాబుల్స్ హౌసింగ్‌ హైజంప్

రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడి స్టాక్ బాగా పెరిగింది. లక్ష్మీవిలాస్ బ్యాంక్ మెర్జర్ కోసం కంపెనీ ఫౌండర్ సమీర్ గెహ్లాట్ తన వాటాను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్తున్నారు. మైనార్టీ షేర్ హోల్డర్గా మిగిలిపోవడానికి కూడా ఆయన సిద్ధపడడంతో స్టాక్ అనూహ్యంగా 14 శాతం లాభపడింది. చివరకు రూ.505 దగ్గర స్టాక్ క్లోజైంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here