6 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే..

0
2


6 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే..

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు ప్రతి రోజు ఆరు గంటల సమయం కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే, మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. లేదంటే, డీ హైడ్రేషన్‌ బారినపడే అవకాశం ఉందని చెబుతున్నారు. శరీరంలో నీటి స్థాయి తగిన మోతాదులో లేని స్థితితో బాధపడడాన్నే డీ హైడ్రేషన్(నిర్జలీకరణ) అంటారు. పరిశోధకులు ‘జర్నల్‌ స్లీప్‌’లో తెలిపిన వివరాల ప్రకారం… ప్రతి రోజు నిద్రపోవాల్సిన 8 గంటల సమయం కంటే చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సమయం నిద్రపోతే మూత్ర పిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయం ఇప్పటివరకు తెలుసు. ఈ ప్రభావం శరీరంలో హైడ్రేషన్‌ స్థాయిపై ఎంతగా చూపుతుందనే విషయం తాజాగా వెల్లడైన పరిశోధన ఫలితాల ద్వారా తెలిసింది.

అమెరికా, చైనాకు చెందిన మొత్తం 25,000 మంది యువతకు మూత్ర సంబంధిత పరీక్షలు చేసి, వారి నిద్ర అలవాట్లను గురించి అభిప్రాయాలు తీసుకున్న పరిశోధకులు… తక్కువ సమయం నిద్రిస్తే డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని తేల్చారు. ప్రతి రోజు ఎనిమిది గంటలు నిద్రించే వారితో పోల్చితే వీరు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం 16 నుంచి 59 శాతం వరకు అధికంగా ఉంటుందని చెప్పారు. మూత్ర విసర్జనను నియంత్రించే వాసోప్రెస్సిన్‌ అనే హార్మోన్‌లను పీయూష గ్రంథి తగిన మోతాదులో స్రవిస్తుంది. దీని ద్వారా శరీరంలో నీటిస్థాయి నియంత్రణ జరుగుతుంది. మనం నిద్రలోకి జారుకున్న సమయంలో వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ శరీరంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

తగినంత సమయం నిద్రపోకుండా తొందరగా నిద్రలేచే అలవాటు ఉన్న వారిలో ఈ హార్మోన్లు కావలసిన స్థాయిలో విడుదల కావని, దీంతో శరీర హైడ్రేషన్‌ స్థాయి తగిన మోతాదులో ఉండదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు ఆషర్‌ రోషింగర్‌ తెలిపారు. ‘మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా చాలా అలసటగా ఉంటుంది. చాలా నీరు తాగాల్సి ఉంటుంది’ అని తెలిపారు. డీ హైడ్రేషన్‌ కారణంగా మన మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం, తలనొప్పి, అలసట, మూత్ర పిండాల పనితీరు బాగా లేకపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు శరీరంపై పడతాయి. రోజుకి ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నవారు ఇంకాస్త ఎక్కువ సమయం నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

  • nullSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here